నన్ను ఆలోచింపచేసిన ఒక వ్యాఖ్య యధాతధంగా, చదివి ఒక్క రెండునిముషాలు ఆలోచించగలిగితే !
ధన్యోస్మి!
------------------------------------------------------------------------------------
ఎవరండీ వీళ్ళు? నా బ్లాగ్‌లో కూడా అడ్డంగా రాస్తున్నారు. ఎంత ఓపిగ్గా రాసినా రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప మామూలుగా రాయడం లేదు. ఇదేం అలవాటు వీళ్ళకి? నేను రెండు సంవత్సరాలనుండి ఇంగ్లీసులో బ్లాగింగ్ చేస్తున్నా. అక్కడ ఇలాంటివి ఎప్పుడూ ఎదుర్కోలేదు. కాని తెలుగులో బ్లాగు మొదలుపెట్టిన రెండునెలలకే వీళ్ళు వెటకారాలు, హేళన చేయడం, అన్నీ తెలిసినట్లు అధిక్యంతో రాయడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ రోజైతే Snkr అని ఒకరూ, srinivas అని ఇంకొకరూ చాలా అసభ్యంగా రాశారు. నా అభిప్రాయాలు రాసుకుందామని బ్లాగ్ పెట్టుకుని రాసుకుంటున్నా. మీ సోది వినాల్సిందేనా అని ఒకడు, చైనా మీద ఎందుకు రాయవు అని ఇంకొకడు, అదెవరో మార్తాండలాగా అని మరొకడు ఏవేవో రాస్తున్నారు. బ్లాగ్ లో మనకు నచ్చిన అభిప్రాయాలు రాసుకునే స్వేఛ్ఛ ఉంటుంది గదా. దాన్ని గుర్తించకుండా వాళ్ళకి నచ్చింది రాయాలంటారేంటి?
వీళ్ళలో కొంతమంది (లేకపోతే అందరూనో) అమెరికాలో స్ధిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా కనిపిస్తున్నారు. అంత చదువు చదివి సభ్యతా, సంస్కారం లేకుండా వెకిలి రాతలు రాయడానికి సిగ్గు ఎలా లేదో అర్ధం కావడంలేదు. శాడిజం అని విన్నాం గాని అది ఇంటర్నెట్ లో కూడా తీర్చుకుంటారని తెలిసి చాలా ఆశ్చర్యంగా ఉంది.
గత నెలరోజులనుండి అప్పుడప్పుడు రాస్తూనె ఉన్నారు. నచ్చకపోతే చదవడం మానేయాలి గానీ ఇలా దాడి చేయడం చూస్తే చీదర సరే, ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఏం సాధించాలని ఇదంతా? వీళ్ళ వ్యవహారం నాకసలు అర్ధం కావడం లేదు. వీళ్ళకేం కావాలి?
ముఖ్యంగా అగ్రిగేటర్ అని చెబుతున్న ఓ సైట్ కి నా బ్లాగ్ ఇచ్చిన దగ్గర్నుండీ ఈ కామెంట్లు వస్తున్నాయి. అది గమనించి సైడ్ కాలంలో ఉంచిన వాళ్ళ బేనర్ని తీసేశాను. కాని వాళ్ళ లిస్టులోంచి తీయలేను కదా. తీయమని చెప్పినా వినేట్లు లేరు.
ఇది చాలా ఘోరం. అగ్రిగేటర్ సైట్ అని ప్రకటించి సబ్ మిట్ చేశాక ఇలా సాటి బ్లాగర్లమీద దాడులు చేయడం చాలా ఘోరం. ఈ స్వభావాన్ని ఎలా గుర్తించాలొ అర్ధం కావడం లేదు. ఎవరైన కొత్త వ్యక్తి ఎదురైతే ఎలా మాట్లాడుతాం? గౌరవిస్తూ మాట్లాడుతాం. పరిచయాలు పెరిగి ఫ్రెండ్‌షిప్ అయితే తప్ప అరె ఒరే అనుకోం. స్నేహం కుదిరినా ఒకళ్ళ అభిప్రాయాలు మరొకళ్లకి నచ్చకపోతే అలా కుదరని విషయాలు రాకుండా జాగ్రత్తపడుతూ స్నేహాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాం. అసలు అటువంటి మర్యాదలేవీ వీళ్ళకి అవసరం లేదా? ఇలాంటి శాల్తీలు ఎదురుగా తగిలితే నాలుగు పీకుతాం. ఇంటర్నెట్ లో అది కుదరదనేనా వీరి ధైర్యం? అసలటువంటి పరిస్ధితిని తెచ్చి మరీ తిట్టించుకుంటున్నారే వీళ్ళు? ఇలా ఆలోచిస్తున్నకొద్ది ఆశ్చర్యంగా ఉంటోంది. మానవ సమాజానికి సంబంధించిన కనీస నియమాలు పాటించట్లేదు వీళ్ళు. సరే ఏం సాధిస్తారు?
తమిళులు చేసుకున్నంతగా తెలుగు సాఫ్ట్ వేర్ ఎవరూ సరిగా డెవలెప్ చేయలేదని, అందువలన తెలుగు బ్లాగింగ్ అందరికీ అందుబాటులోకి లేకుండా పోయిందనీ కొద్దిగా బాధపడుతుండే వాడ్ని. ఈ సంకలినులు చూశాక సంతోషం వేసింది. ఆ సంతోషంలోనే కనబడిన అగ్రిగేటర్ లన్నింటికీ నా బ్లాగ్ పేరు ఇచ్చేశా. తీరా చూస్తే వెటకారాలు, ఎగతాళి వగైరాలు. టెక్నాలజీని మంచిని పెంచడానికీ, మనకు తెలిసిందాన్ని నలుగురికీ పంచడానికీ వినియోగించుకోవాలి గానీ ఇలా లేని శతృత్వం పెంచుకోవడానికి ఉపయోగించుకోవడం ఒక విధంగా బాధగా ఉంది. అపాత్రదానం అన్నట్లు అర్హత లేని వారికి సాఫ్ట్ వేర్ విద్య అందిందే అనుకోండి. ఇలా దుర్వినియోగం చేయడమేనా? ఇక్కడ ప్రజల డబ్బుతోనే చదువులన్నీ చదువుకుంటున్నాం. ప్రజల డబ్బు అని అంగీకరించకపోతే కనీసం తల్లిదండుల డబ్బుతోనైనా అని అంగీకరిస్తారు కదా? అలా చదువుకుని విజ్ఞానాన్ని ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారే వీళ్ళు?
విశేఖర్
teluguvartalu.wordpress.com
------------------------------------------------------------------------------------